గోదావరిఖనిలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక రక్తదాన శిబిరం: 200 మంది యువత రక్తదానం

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ గోదావరిఖనిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువత రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది యువత రక్తాన్ని దానం చేశారు.

గోదావరిఖనిలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక రక్తదాన శిబిరం: 200 మంది యువత రక్తదానం

గోదావరిఖని, అక్టోబర్ 22 :

అనారోగ్యానికి గురైన వారిని, ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు రక్తం ఎంతో అవసరం అని, అందుకని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పిలుపునిచ్చారు.

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీపీ అంబర్ కిషోర్ ప్రారంభించారు.

ప్రమాదాలలో ప్రాణ నష్టం

ఈ సందర్భంగా రక్తదాతలను ఉద్దేశించి కమిషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ... ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరగడం కారణంగా అనుకున్న సమయానికి రక్తం అందక ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరమైన ఆపరేషన్ల సందర్భంగా రోగులకు రక్తం అవసరం ఉంటున్న నేపథ్యంలో రక్తదానం చేయడం మూలంగా మరొకరి జీవితానికి వెలుగులను ఇచ్చిన వారు అవుతామని పేర్కొన్నారు.

అపోహలు వీడండి: ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలి

సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య తగ్గిపోతుందని, ఈ విషయంపై లయన్స్ క్లబ్తో పాటు అనేక స్వచ్ఛంద సంఘాలు ప్రజానీకంలో అవగాహన కల్పిస్తున్నాయని సీపీ తెలిపారు. రక్తం దానం చేయడం మూలంగా అనారోగ్యం ఎదురవుతుందని, ఇబ్బందులకు గురవుతామని ఇప్పటికీ చాలామందిలో అపోహ ఉందని, అయితే రక్తదానం చేయడం వల్ల ఎలాంటి హాని లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా, విధిగా ఆలోచన చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సీపీ అంబర్ కిషోర్ ఈ సందర్భంగా యువతకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు.

200 మంది యువత రక్తదానం

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరంలో రక్తం దానం చేయడానికి ముందుకొచ్చిన యువతను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.

గోదావరిఖని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో సుమారుగా 200 మంది యువత స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసిపి మడత రమేష్, గోదావరిఖని సిఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రదీప్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సహజ రాజేందర్, ఎల్లప్ప, మల్లికార్జున్ తో పాటు ఎస్ఐలు పాల్గొన్నారు.